ప్రశాంతి నిలయం, అక్టోబర్ 24, 2026: శ్రీ సత్యసాయి పాఠశాలల 8వ జాతీయ సదస్సు ఈ ఉదయం ప్రశాంతి నిలయంలో ఘనంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విద్యావేత్తలు, పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరై భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ‘ఎడ్యుకేర్’ విద్యా దృక్పథాన్ని సమిష్టిగా పునరుద్ఘాటించారు.శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్, క్రోంపేట్, చెన్నై విద్యార్థుల వేద మంత్రోచ్చారణలతో ప్రారంభమైన కార్యక్రమంలో అనంతరం గౌరవనీయులైన ప్రముఖుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన జరిగింది.
స్వాగత ప్రసంగం చేసిన శ్రీ ఉమేష్ డాంగ్, కో-కన్వీనర్, SSSNCS, దేశవ్యాప్తంగా విస్తరించిన సాయి విద్యా ఉద్యమం గురించి వివరించారు. 104 పాఠశాలలు, 52,000 మందికి పైగా విద్యార్థులు, 2,700 మంది ఉపాధ్యాయులు, లక్ష మందికి పైగా తల్లిదండ్రులు ఈ విద్యా ఉద్యమంతో అనుసంధానమై ఉన్నారని తెలిపారు.
‘ప్రాక్టీసింగ్ సాయి ఫిలాసఫీ’ అనే అంశంపై ప్రసంగించిన శ్రీ త్రిభువన్ సచ్దేవ, కన్వీనర్, SSSNCS, భగవాన్ బోధనలను కేవలం విశ్వసించడం లేదా చెప్పడం మాత్రమే కాకుండా వాటిని ఆలోచన, మాట, చేతల్లో ఆచరించాలని విద్యావేత్తలకు పిలుపునిచ్చారు.
సభను ఉద్దేశించి ప్రసంగించిన శ్రీ నిమిష్ పాండ్యా, AIP, SSSSO, గురుకుల విద్యా విధానం యొక్క శాశ్వత ప్రాధాన్యతను వివరించారు. విద్యార్థులను సత్ప్రవర్తన, జ్ఞానం, నైతిక విలువలు, సమగ్ర వ్యక్తిత్వం మరియు నిస్వార్థ సేవాభావం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కీలక పాత్రను, వారికి తల్లిదండ్రుల సహకారం అవసరాన్ని వివరించారు.
సృజనాత్మకతకు అద్దం పట్టిన రెండు అంతస్తుల విద్యా ప్రదర్శనమందిరంలో ఉదయం కార్యక్రమాల అనంతరం, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి విద్యా తత్వాన్ని ఆచరణాత్మకంగా ప్రతిబింబించేలా రూపొందించిన రెండు అంతస్తుల ప్రత్యేక ప్రదర్శనను సత్సంగ్ హాల్లో ప్రారంభించారు.ఈ ప్రదర్శనను శ్రీ ఆర్. జె. రత్నాకర్, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రారంభించారు. ఆయనతో పాటు శ్రీ కె. చక్రవర్తి, చైర్మన్, శ్రీ సత్యసాయి గ్లోబల్ కౌన్సిల్ మరియు ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, శ్రీ ఎస్. ఎస్. నాగానంద్, ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, సంస్థకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన అక్టోబర్ 24, 25 తేదీలలో కొనసాగుతుంది.
సృజనాత్మకత, వైవిధ్యం, అంశాల లోతు మరియు అనుభవపూర్వక ప్రదర్శన ఈ ఎగ్జిబిషన్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కేవలం సమాచారాన్ని ప్రదర్శించడం కాకుండా, భగవాన్ వారి విద్యా తత్వాన్ని విద్యా సంస్థల్లో ఎలా ఆచరణలోకి తీసుకురావచ్చో వివిధ సృజనాత్మక ప్రదర్శనలు, నమూనాలు, వివరణలు మరియు అంశాల ఆధారిత స్టాళ్ల ద్వారా చూపించారు.
ప్రదర్శనలోని మొదటి అంతస్తులో నేషనల్ కౌన్సిల్ ఫర్ శ్రీ సత్యసాయి స్కూల్స్ ఆధ్వర్యంలో తొమ్మిది అంశాలపై ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ప్రీ-ప్రైమరీ విద్య, పర్యావరణ అధ్యయనం, గైడెన్స్ & కమ్యూనికేషన్, వేద పఠనం, ఎసెన్షియల్ యోగా, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి జీవితం & బోధనలు, పరిశోధన, వెల్నెస్ & ఫిట్నెస్ తదితర అంశాలు ఇందులో ఉన్నాయి.
విద్యకు సంబంధించిన వివిధ అంశాలను సమగ్రంగా అనుసంధానిస్తూ రూపొందించిన ఈ ప్రదర్శనలు విద్యా విజ్ఞానంతో పాటు మానవీయ విలువలు, ఆధ్యాత్మిక అవగాహన, శారీరక ఆరోగ్యం, పర్యావరణ బాధ్యత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు భగవాన్ వారి జీవితం, బోధనల పట్ల అవగాహనను పెంపొందించే విధానాన్ని ప్రతిబింబించాయి.
రెండవ అంతస్తులో ‘ఇండిపెండెన్స్’ (స్వాతంత్ర్యం) అనే ప్రధాన అంశంతో 21 స్టాళ్లు ఏర్పాటు చేశారు. భౌతిక మరియు సామాజిక, మానసిక, భావోద్వేగ మరియు మనోవైజ్ఞానిక, ఆధ్యాత్మిక కోణాల్లో స్వాతంత్ర్యానికి ఉన్న వివిధ పార్శ్వాలను ఈ స్టాళ్లు ఆవిష్కరించాయి.
సృజనాత్మక ప్రదర్శనలు, నమూనాలు, వివరణలు మరియు అంశాల ఆధారిత రూపకల్పన ద్వారా స్వాతంత్ర్యం అంటే కేవలం బాహ్య స్వేచ్ఛ మాత్రమే కాదని, ఆత్మ అవగాహన, భావోద్వేగ సమతుల్యత, మానసిక దృఢత్వం, సామాజిక బాధ్యత మరియు ఆధ్యాత్మిక విచక్షణ కలిగిన వ్యక్తిగా ఎదగడమని ఈ ప్రదర్శనలు చాటిచెప్పాయి.మొత్తంగా, ఈ ప్రదర్శనల ద్వారా సాయి విద్య విద్యార్థులను సమగ్ర వ్యక్తిత్వం కలిగిన వారిగా ఎలా తీర్చిదిద్దుతుందో అనుభవపూర్వకంగా ఆవిష్కరించారు. విలువలు, అవగాహన, క్రమశిక్షణ, జ్ఞానం మరియు నిస్వార్థ సేవాభావంతో విద్యార్థులను జీవితాన్ని లక్ష్యపూర్వకంగా, అర్థవంతంగా నడిపించే వ్యక్తులుగా తీర్చిదిద్దే విధానాన్ని ప్రదర్శించారు.
ఎడ్యుకేర్ ఆచరణలో’ అన్న భావనకు సజీవ రూపంగా నిలిచిన ఈ ప్రదర్శన, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి విద్యా తత్వం తరగతి గది పరిధిని దాటి విద్యార్థుల్లో వ్యక్తిత్వ వికాసం, మానవీయ విలువలు, సత్ప్రవర్తన, బాధ్యతాభావం మరియు నిస్వార్థ సేవా స్ఫూర్తిని పెంపొందించగలదని చాటిచెబుతోంది.










0 Comments