విశాఖపట్నం :జోన్ పరిధిలోని 350కి పైగా స్టేషన్లలో జన్ సంవాద్ నిర్వహణ
👉 220 మందికి పైగా అధికారులు, 800 మందికి పైగా సూపర్వైజర్లు, సిబ్బంది భాగస్వామ్యం
👉 17,500 మందికి పైగా ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలు, సూచనలు, ఫిర్యాదులు వెల్లడి
రైల్వేలకు, ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంభాషణను బలోపేతం చేయడం, ప్రయాణికుల్లో అవగాహన పెంపొందించడం, రైల్వే సేవలు మరియు ప్రయాణికుల సౌకర్యాల మెరుగుదలలో ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా దక్షిణ కోస్తా రైల్వే (SCoR) నేడు జోన్ పరిధిలోని 350కి పైగా స్టేషన్లలో ‘జన్ సంవాద్’ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా, దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాథుర్ రైల్వే అధికారులు ప్రయాణికులు, ప్రజలతో నేరుగా మాట్లాడి, వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించడంతో పాటు రైల్వే సేవలు, ప్రయాణికుల సౌకర్యాలపై వారి అంచనాలు, అవసరాలను తెలుసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో 220 మందికి పైగా అధికారులు, 800 మందికి పైగా సూపర్వైజర్లు, సిబ్బంది పాల్గొని ప్రయాణికులు, ప్రజలతో మమేకమయ్యారు. జోన్ వ్యాప్తంగా నిర్వహించిన ఈ ముఖాముఖి కార్యక్రమాల్లో 17,500 మందికి పైగా ప్రజలు పాల్గొని రైల్వే సేవలు, స్టేషన్ సదుపాయాలు, ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించి తమ అభిప్రాయాలు, సూచనలు, ఫిర్యాదులను తెలియజేశారు.
కొనసాగుతున్న పక్షోత్సవ కార్యక్రమంలో భాగంగా జనరల్ మేనేజర్ విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పరిశుభ్రత కార్యక్రమానికి నాయకత్వం వహించారు. స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రతను ఉన్నత ప్రమాణాలతో నిర్వహించడం, ప్రయాణికులకు శుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. స్టేషన్లో ప్రయాణికులతో స్వయంగా మాట్లాడి, రైల్వే సౌకర్యాలు, సేవలపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. జోన్లోని వివిధ స్టేషన్లలోనూ రైల్వే అధికారులు, సిబ్బంది ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని, స్టేషన్ ప్రాంగణాలను పరిశుభ్రంగా, ప్రయాణికులకు ఆహ్వానించదగిన రీతిలో ఉంచడం అందరి సమష్టి బాధ్యత అని చాటిచెప్పారు.‘జన్ సంవాద్’ కార్యక్రమం ద్వారా రైల్వే అధికారులు, ప్రయాణికులు, ప్రజల మధ్య ప్రత్యక్ష సంభాషణకు అవకాశం కల్పించబడుతోంది. తద్వారా ప్రయాణికుల అవసరాలను అర్థం చేసుకోవడం, వారి సమస్యలపై దృష్టి సారించడం, రైల్వే సేవల మెరుగుదలకు ఉపయోగపడే సూచనలను స్వీకరించడం సాధ్యమవుతుంది. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, సిబ్బంది ప్రయాణికులకు రైల్వే భద్రత, పరిశుభ్రత, బాధ్యతాయుతమైన ప్రయాణ పద్ధతులు, రైల్వే ప్రాంగణాల సరైన వినియోగంపై అవగాహన కల్పించారు.
స్టేషన్ సదుపాయాలు, ప్రయాణికుల సౌకర్యాలు, మొత్తం ప్రయాణ అనుభవానికి సంబంధించి తమ అభిప్రాయాలు, సూచనలను స్వేచ్ఛగా తెలియజేయాలని దక్షిణ కోస్తా రైల్వే ప్రయాణికులను ప్రోత్సహించింది. ఇటువంటి ముఖాముఖి కార్యక్రమాలు మెరుగుదల అవసరమైన అంశాలను గుర్తించడానికి, ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలను మరింత సమర్థవంతంగా అందించడానికి రైల్వే అధికారులకు దోహదపడతాయి. ప్రజల భాగస్వామ్యంతో సురక్షితమైన, పరిశుభ్రమైన, సమర్థవంతమైన, ప్రయాణికులకు అనుకూలమైన రైల్వే సేవలను అందించేందుకు దక్షిణ కోస్తా రైల్వే తన నిబద్ధతను ఈ కార్యక్రమం ద్వారా పునరుద్ఘాటించింది.వై. బాలాజీ కిరణ్
ముఖ్య ప్రజా సంబంధాల అధికారి (CPRO)
దక్షిణ కోస్తా రైల్వే
విశాఖపట్నం



0 Comments