*మింది / అక్కిరెడ్డిపాలెం:*గురుశిష్య సంప్రదాయం మానవజాతికి శ్రీరామరక్ష అని మింది ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. అనంతలక్ష్మి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం మింది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పాఠశాలకు అవసరమైన కుర్చీలు, పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రిని అధ్యాపకుల చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అనంతలక్ష్మి మాట్లాడుతూ, తాము విద్య నేర్చుకున్న పాఠశాలలకు పూర్వ విద్యార్థులు మౌలిక సదుపాయాలు కల్పించడం అభినందనీయమన్నారు. అందరి సహకారంతో ఈ పాఠశాలను మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములైన జర్నలిస్టులకు అధ్యాపకులు అభినందనలు తెలిపారు.
గౌరవ అతిథిగా హాజరైన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభ్యాసం సాగిస్తున్న ఎంతోమంది విద్యార్థులు నేడు ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా కొనసాగుతున్నారన్నారు.
ఏ దేశంలో, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ తాము విద్యను అభ్యసించిన పాఠశాల, కళాశాల, యూనివర్సిటీలను మరిచిపోకూడదన్నారు. మన మూలాలను గుర్తించి, వాటి అభివృద్ధికి తమ వంతు సహాయం అందించాలన్నారు. పిల్లలు మంచి విద్యాభ్యాసం సాగించి అపారమైన ఉపాధి అవకాశాలు పొందాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని, ఇందులో అన్ని వర్గాలను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.
విశాఖ జిల్లా అధ్యక్షులు పి. నారాయణ, కార్యదర్శి జి. శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఫెడరేషన్ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దృష్టిలో ఉంచుకుని గత రెండు రోజులుగా విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మరికొద్ది రోజులపాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని వీరు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా యూనియన్ విశాఖ జిల్లా కార్యదర్శి జి. శ్రీనివాసరావు అందించిన కుర్చీలు, పుస్తకాలు, పెన్నులు, ఇతర సామగ్రిని అధ్యాపకులకు జర్నలిస్టుల సంఘ నేతలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మింది ప్రాథిమిక పాఠశాల హెడ్ మాస్టర్ కె అనంత లక్ష్మి, ఉపాధ్యాయులు డి సత్యనారాయణ, వి రమేష్, జి నర్సింగరావు, నిరూపమా పరదేశి..బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి కింతాడ మదన్, ఫెడరేషన్ ఉపాధ్యక్షులు నగేష్ బాబు, జాయింట్ సెక్రటరీ రాజశేఖర్, గాజువాక సంఘ కార్యదర్శి నాయుడు బాబు, జగన్ పెద్ద ఎత్తున జర్నలిస్టులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
అనంతరం పాఠశాల అధ్యాపకులను జర్నలిస్టు సంఘ నేతలు ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో ఈ పాఠశాలను మరింతగా అభివృద్ధి పథంలో తీర్చిదిద్దాలని అందరూ ఆకాంక్షించారు.
---





0 Comments