తుఫాన్ 'మురాసు' నేపథ్యంలో అప్రమత్తమైన దక్షిణ కోస్తా రైల్వే*


విశాఖపట్నం :జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాథుర్ సమీక్ష – భద్రతా చర్యలు, అత్యవసర పరిస్థితుల సంసిద్ధత, ప్రయాణికులకు సహాయ ఏర్పాట్లపై సమీక్ష*

*దక్షిణ కోస్తా రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయంలో 24 గంటలూ పనిచేస్తున్న వార్ రూమ్*

తుఫాన్ 'మురాసు' ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రయాణికులు, రైల్వే సిబ్బంది భద్రతతో పాటు రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు, విపత్తు నిర్వహణ సంసిద్ధతపై దక్షిణ కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ సందీప్ మాథుర్ సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు డివిజనల్ రైల్వే మేనేజర్లు (DRMs), ప్రిన్సిపల్ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ (PHODs)తో సమీక్షా సమావేశం నిర్వహించారు.

➢ దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్న రైల్వే వంతెనలు, ట్రాక్‌లు, యార్డులు, సిగ్నలింగ్ వ్యవస్థలపై నిరంతర నిఘాను మరింత పటిష్టం చేశారు.

➢ వర్షపు నీరు నిలిచిపోకుండా ఉండేందుకు నీటి పారుదల కాలువలు, క్యాచ్ వాటర్ డ్రెయిన్లలో పేరుకుపోయిన వ్యర్థాలు, మట్టి, ఇతర అడ్డంకులను తొలగించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

➢ ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, వంతెనల వద్ద పెట్రోలింగ్ సిబ్బంది, వాచ్‌మెన్‌లను నియమించారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రాక్ మరమ్మతులు చేపట్టేందుకు అవసరమైన సామగ్రిని తగినంతగా అందుబాటులో ఉంచారు.

➢ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సన్నిహిత సమన్వయం కొనసాగించాలని, వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలు, సూచనలను నిరంతరం పర్యవేక్షించాలని జనరల్ మేనేజర్ అధికారులను ఆదేశించారు.

➢ అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన, మెరుగైన సమన్వయం కోసం దక్షిణ కోస్తా రైల్వే జోనల్ ప్రధాన కార్యాలయంతో పాటు డివిజనల్ ప్రధాన కార్యాలయాల్లో 24 గంటలూ పనిచేసే వార్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

➢ ప్రయాణికుల సహాయం, భద్రతకు సంబంధించిన ఏర్పాట్లను కూడా మరింత పటిష్టం చేశారు.

➢ ప్రయాణికులకు ఎప్పటికప్పుడు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రధాన రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. రైళ్లు రద్దయిన పక్షంలో టికెట్ రీఫండ్‌లను సులభతరం చేసేందుకు అదనపు కౌంటర్లను కూడా నిర్వహించనున్నారు.

➢ ప్రయాణికులకు ఆహారం అందుబాటులో ఉండేలా క్యాటరింగ్ యూనిట్లు తగినంత ఆహార నిల్వలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఏర్పాట్లు కూడా చేశారు.

➢ అత్యవసర పరిస్థితుల్లో నిరంతరాయంగా వైద్య సహాయం అందించేందుకు వైద్య బృందాలు, ప్రథమ చికిత్స సదుపాయాలు, అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.

➢ సివిల్ డిఫెన్స్ సిబ్బంది, స్కౌట్స్ అండ్ గైడ్స్ వాలంటీర్లను అప్రమత్తం చేశారు. అవసరమైతే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వే సిబ్బందిని సిద్ధంగా ఉంచారు.

➢ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో అవసరమైనప్పుడు సహాయక చర్యలు చేపట్టేందుకు అత్యవసర స్పందన బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు.

Post a Comment

0 Comments