ఆర్నాబ్ తుపాను సహాయక చర్యలు ముమ్మరం. * శుక్రవారం నాటికి రహదారులపై కూలిన చెట్ల తొలగింపు పూర్తి చేయాలి * 45 జేసీబీలతో రాత్రింబవళ్లు సహాయక చర్యలు. * నార్త్‌, వెస్ట్‌ జోన్లలోని నాలుగు పునరావాస కేంద్రాల్లో 94 మందికి ఆశ్రయం. — జీవీఎంసీ కమిషనర్


విశాఖపట్నం, అక్టోబర్ 29: ఆర్నాబ్ తుపాను ప్రభావంతో నగరంలో నేలకొరిగిన చెట్ల తొలగింపు, రహదారులపై పేరుకుపోయిన వ్యర్థాల శుభ్రత, దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణ పనులను జీవీఎంసీ ముమ్మరంగా చేపడుతోందని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గురువారం ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి, తుపాను కారణంగా నేలకొరిగిన చెట్ల తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణ, రహదారుల పునరుద్ధరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈస్ట్ జోన్ లో దత్ ఐలాండ్ నుంచి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లే రహదారితో పాటు బీచ్ రోడ్డులో పర్యటించి, చెట్ల తొలగింపు అనంతరం రహదారులపై మిగిలిన కొమ్మలు, ఆకులు, ఇతర వ్యర్థాలను పూర్తిస్థాయిలో తొలగించాలని అధికారులను ఆదేశించారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న రహదారుల్లో గుంతలను గుర్తించి తక్షణమే ప్యాచ్‌వర్క్ పనులు చేపట్టి, రహదారులను త్వరితగతిన పునరుద్ధరించాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.

"1,192 చెట్లు నేలకొరగ్గా.. 1,057 చెట్ల తొలగింపు పూర్తి"

గురువారం 6 గంటల వరకు అందిన సమాచారంతో తుపాను ప్రభావంతో జీవీఎంసీ పరిధిలోని పది జోన్లలో మొత్తం 1,192 చెట్లు నేలకొరిగాయి. వీటిలో 1,057 చెట్లను కట్ చేసి కొమ్మలను తొలగించగా, మిగిలిన 135 చెట్లకు సంబంధించి కటింగ్‌, కొమ్మల తొలగింపు పనులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇప్పటివరకు 902 చెట్లను పూర్తిగా తరలించి, వాటి కారణంగా ఏర్పడిన అడ్డంకులను తొలగించారు. మరో 290 చెట్లను తరలించాల్సి ఉంది. చెట్లను కట్ చేయడం, కొమ్మలను తొలగించడం, వాటిని పూర్తిగా తరలించడం వంటి పనులను వేగవంతం చేసి, శుక్రవారం నాటికి రహదారులపై కూలిన చెట్ల తొలగింపు పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమిషనర్ తెలిపారు.

చెట్ల తొలగింపు పనుల కోసం 45 జేసీబీలతో పాటు టిప్పర్లు, అదనపు పారిశుద్ధ్య కార్మికులను వినియోగిస్తూ రాత్రింబవళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. చెట్ల తొలగింపు అనంతరం రహదారులపై మిగిలిన కొమ్మలు, ఆకులు, ఇతర వ్యర్థాలను కూడా తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.

"313 రహదారులపై అడ్డంకుల తొలగింపు" తాజా నివేదిక ప్రకారం, నేలకొరిగిన చెట్ల కారణంగా నగరంలో 313 రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నివేదిక సమయానికి ఈ 313 రహదారులపైనా అడ్డంకులను తొలగించి రాకపోకలను పునరుద్ధరించినట్లు తెలిపారు. మిగిలిన చెట్లను తరలించే సమయంలోనూ ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.

"శుక్రవారం నాటికి శతశాతం తాగునీటి సరఫరాకు చర్యలు" 

తుపాను ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో అంతరాయం ఏర్పడిన తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. గురువారం నాటికి నగరంలో సుమారు 70 శాతం తాగునీటి సరఫరాను పునరుద్ధరించామని, మిగిలిన ప్రాంతాలకు కూడా శుక్రవారం నాటికి శతశాతం నీటి సరఫరా అందించేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

నీటి సరఫరాలో అంతరాయాలు ఎదురవుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రజలకు సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితిలో తాగునీటి సేవలు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.

నేటికీ పునరావాస కేంద్రాల్లో 94 మందికి ఆశ్రయం" తుపాను నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జీవీఎంసీ పరిధిలోని అన్ని జోన్లలో అవసరమైన ప్రాంతాల ప్రజలను పలు పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి ఆహారం, వసతి తదితర సౌకర్యాలు కల్పించినట్లు కమిషనర్ తెలిపారు. పరిస్థితులు అనుకూలించిన అనంతరం పలువురిని సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చినట్లు పేర్కొన్నారు.

అయితే, గురువారం నాటికి నార్త్‌, వెస్ట్‌ జోన్ల పరిధిలోని నాలుగు పునరావాస కేంద్రాల్లో మొత్తం 94 మంది ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. వారికి ఆహారం, వసతి, ఇతర అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పునరావాస కేంద్రాల్లోని ప్రజల భద్రత, సౌకర్యాలపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.

"సహాయక చర్యలపై నిరంతర పర్యవేక్షణ" 

నగరంలో తుపాను సహాయక చర్యలను సమన్వయం చేసేందుకు జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, ఇంజినీరింగ్‌, పారిశుద్ధ్య విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రహదారులపై కూలిన చెట్ల తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా పునరుద్ధరణ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు.


ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ పల్లి నల్లనయ్య, పర్యవేక్షక ఇంజనీర్ ఏ. శ్రీనివాసరెడ్డి,కార్యనిర్వాహక ఇంజనీర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


పౌర సంబంధాల అధికారి

జీవీఎంసీ

Post a Comment

0 Comments