నక్కపల్లి, అక్టోబర్ 29:- పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి మండలంలో హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం పర్యటించారు. తొలుత దేవవరం గ్రామంలోని వినాయక, ఆంజనేయస్వామి ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవవరం, గొడ్డిచర్ల గ్రామాల్లో స్థానిక ఎన్నికల ప్రచారంలో పాల్గొని, కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.గ్రామాల్లో హోంమంత్రికి ప్రజలు ఘనస్వాగతం పలికారు. కూటమి శ్రేణులు ‘జై అనితమ్మ.. జై జై అనితమ్మ’ అంటూ నినాదాలు చేశారు. మంత్రి ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.దేవవరం గ్రామంలో జరిగిన ప్రచారంలో హోంమంత్రి అనిత మాట్లాడుతూ.. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. పాయకరావుపేట నియోజకవర్గానికి ఎన్నో పరిశ్రమలను తీసుకొచ్చామని, స్టీల్ ప్లాంట్ రాకతో స్థానిక యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఉద్యోగాన్ని వదిలి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో హేమలత ఎన్నికల బరిలోకి దిగారని పేర్కొన్నారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే సమాజంలో అనేక మార్పులు తీసుకురాగలరని అన్నారు. దేవవరం గ్రామంలో రెండున్నరేళ్లలో రూ.11 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.*గోదావరి జలాలతో పాయకరావుపేటలో పంటల సాగు*గొడ్డిచర్ల గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో హోంమంత్రి అనిత వీధుల్లో పర్యటిస్తూ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రజలు ఆశీర్వదించారని గుర్తుచేశారు.
పాయకరావుపేట నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకురావడం సంతోషంగా ఉందని అన్నారు. గోదావరి జలాలతో రైతులు పంటలు పండించుకునే అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జలజీవన్ మిషన్ నిర్వీర్యమైందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులను వేగవంతం చేశామని తెలిపారు. ప్రతి ఇంటికీ తాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.
*
నక్కపల్లి పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది*నక్కపల్లి ప్రాంతంలో రానున్న పరిశ్రమలతో స్థానికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని హోంమంత్రి అనిత ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో నక్కపల్లి జంషెడ్పూర్ తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.మహిళలకు ఉపాధి కల్పించేందుకు టాయ్ పార్క్‌ను తీసుకొస్తున్నామని, దీనివల్ల మహిళలకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని వివరించారు. ప్రజలకు సేవ చేయడంతోపాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేసే నాయకులను స్థానిక ఎన్నికల్లో ఎన్నుకోవాలని కోరారు.జడ్పీటీసీ అభ్యర్థి రమేష్ ఆర్థికంగా పేదవాడైనా, ప్రజలకు సేవ చేయడంలో అత్యంత ధనవంతుడని అనిత పేర్కొన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు, గ్రామాల అభివృద్ధికి కృషి చేసే కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.





0 Comments