ఆంధ్రవిశ్వవిద్యాలయం, అక్టోబర్ 23:భాష పరిరక్షణకు వారధులుగా నవతరం నిలవాలని ఆంత్రపోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఆచార్య బి.వి శర్మ అన్నారు. శుక్రవారం ఏయూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సమావేశ మందిరంలో భారతీయ భాష సమితి సహకారంతో ఆంధ్రవిశ్వవిద్యాలయం, శక్తి ఫౌండేషన్ సంయుక్తంగా గిరిజన భాషలు-భారతీయ భాషలే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం సదస్సునుద్దేశించి మాట్లాడుతూ గిరిజన తెగలకు భాష ఒక ప్రత్యేక గుర్తింపును అందిస్తుందన్నారు. భాష లేకపోతే జ్ఞానం నశించిపోతుందన్నారు. భాషలు కేవలం భావ ప్రకటన కోసమే కాకుండా సమూహాల సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తూ, ఒక గుర్తింపును అందిస్తాయన్నారు. గిరిజన తెగలలో వినియోగించే భాషలు వారికి ఒక ప్రత్యేకతను సంతరింపచేస్తాయన్నారు. మాట్లాడటం వలన కూడా భాషను పరిరక్షించుకోవడం సాధ్యపడుతుందన్నారు. భాషను ఇంటికే పరిమితం చేయకుండా సమాజంలో కూడా విస్తృతంగా వినియోగించడం ఎంతో అవసరమన్నారు. భాషలను గుర్తించడం, ఒక ప్రత్యేకమైన మ్యాపింగ్ చేసే దిశగా తాము పనిచేస్తున్నామన్నారు. భాషలకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించడానికి ఇటువంటి సదస్సులు ఉపకరిస్తాయన్నారు.ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ భాషను సాంకేతికతతో అనుసంధానం చేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చునన్నారు. ఈ దిశగా భాషవేత్తలు, సాంకేతిక నిపుణులు కలసి పనిచేయాలని సూచించారు. ఏయూ శతాబ్ధి ఉత్సవాలలో భాగంగా గిరిజన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టి నిర్వహించిన విధానం వివరించారు. ఆదివాసీ చిన్నారులు పాఠశాల విద్యనుంచి కళాశాల విద్యకు, ఉన్నత విద్యకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గడం గమనించామన్నారు. సామాజిక, ఆర్ధిక కారణాలతో బాలికలు పాఠశాల స్థాయిలో విద్యకు దూరం అవుతున్నారన్నారు. ఏయూ జాతీయ సేవాపథకం సహకారంతో ఆదివాసీ పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తూ వారిని ఉన్నత విద్య దిశగా నడిపించే ప్రయత్నం జరుగుతోందన్నారు. అదే విధంగా అల్లూరి జిల్లాలో ఆదివాసీల అభివృద్ధికి ఉపయుక్తంగా ఏయూలోని విభిన్న విభాగాలు కలసి పనిచేయడానికి సిద్దంగా ఉన్నాయన్నారు. ఈ దిశగా అల్లూరి జిల్లా కలెక్టర్‌తో అవగాహన ఒప్పందం చేసుకునే ప్రక్రియ జరుగుతోందని వివరించారు. ఆదివాసీల సాంప్రదాయ జ్ఞానం, ఆరోగ్యం, జీవనశైలి తదితర అంశాలను అధ్యయనం చేయడం జరుగుతుందన్నారు.
భారతీయ భాష సమితి సీనియర్ ఎక్స్‌పర్ట్ ఆచార్య సర్రాజు మాట్లాడుతూ భారతీయ భాషలతో ఏకత్వం, సామరస్యం సాధన దిశగా భారతీయ భాష సమితి పనిచేస్తోందన్నారు. భాషను పరిపుష్టి చేసే దిశగా కృషి జరగాలన్నారు. భారత్‌లో 1300లకు పైగా భాషలు ఉన్నాయన్నారు. కొన్ని లిపికి కలిగి ఉన్నాయని, మరికొన్ని లిపి లేనివి కూడా ఉన్నాయన్నారు. విద్య రంగానికి సంబంధించిన పుస్తకాలను గిరిజన భాషల్లో తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గిరిజన భాషలను ఏఐతో అనుసంధానించాల్సిన అవసరం ఉందన్నారు.
సైన్స్ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు మాట్లాడుతూ భారత దేశం విభిన్న భాషలకు స్థానం కల్పించిందన్నారు. గిరిజన భాషల పరిరక్షణకు దోహదపడే విధంగా సదస్సును నిర్వహిస్తున్న విధానం వివరించారు. గిరిజనుల సంగీతం, కళలను సైతం సమాజానికి, ప్రజలకు తెలియజేసే ప్రయత్నం జరగాలని సూచించారు. ఆదివాసీ నృత్యాలు ప్రదర్శన ఏర్పాటు చేసామన్నారు.
కార్యక్రమంలో భాగంగా అతిధులను ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ సత్కరించి, జ్ఞాపికలను బహూకరించారు. కార్యక్రమాన్ని సదస్సు సమన్వయకర్తలు ఆచార్య పి.వి లక్ష్మీ నారాయణ, ఆచార్య డి.సంధ్య దీపికలు సమన్వయం చేసారు. సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ కవి, సినీ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.




0 Comments