*పరిషత్ ఎన్నికలు, కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి* * బ్యాలెట్ పేపర్ల ముద్రణ, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలి * సున్నిత, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలి * సమీక్షలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్


విశాఖపట్నం, అక్టోబర్ 26: పరిషత్ ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అన్ని ఏర్పాట్లను నిబంధనల ప్రకారం, నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగ్ హాలులో జాయింట్ కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి, డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులతో ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించారు.

నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే గుర్తుల కేటాయింపు, తుది అభ్యర్థుల జాబితా సిద్ధం చేయడం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ చేపట్టాలన్నారు. అక్టోబర్ 27 సాయంత్రం నుంచే పోస్టల్ బ్యాలెట్, సాధారణ బ్యాలెట్ పేపర్ల ముద్రణ ప్రారంభించాలని సూచించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని, ఆర్వో కార్యాలయాల్లో ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి షెడ్యూల్ ప్రకారం శిక్షణ పూర్తి చేయాలని, అక్టోబర్ 30, 31 తేదీల్లో తదుపరి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. సిబ్బంది ర్యాండమైజేషన్ పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.

జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 203 పోలింగ్ స్టేషన్లు, 98 పోలింగ్ లొకేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీటిలో 93 సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని, మైక్రో అబ్జర్వర్ల నియామకాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు 16 మంది జోనల్ అధికారులు, 25 మంది రూట్ అధికారులు, మొత్తం 1,465 మంది సిబ్బందిని వినియోగిస్తున్న నేపథ్యంలో విధుల కేటాయింపులు, నియామక ఉత్తర్వులు సకాలంలో జారీ చేయాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు స్కెచ్ సిద్ధం చేయాలని, ప్రతి మండలంలో ఒక మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో కనీస వసతులు, తాగునీరు, ఇతర అవసరమైన ఏర్పాట్లు కల్పించాలని, రిసెప్షన్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ముందుగానే నియమించి, విధుల ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. 18 కౌంటింగ్ టేబుళ్లతో ఐదు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేయాలని, ప్రతి రౌండ్‌లో వెయ్యికి మించకుండా ఓట్ల లెక్కింపు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించేలా ఏర్పాట్లు చేయాలన్నారు.


*జెడ్పీటీసీలకు వైట్, ఎంపీటీసీలకు పింక్ కలర్ బ్యాలెట్లు*


జెడ్పీటీసీ ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు, ఎంపీటీసీ ఎన్నికలకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు వినియోగిస్తారని, ఈ విషయంపై ఓటర్లకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రచారాలు, ర్యాలీలు, సమావేశాలు, వాహనాల వినియోగానికి నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేశారు. తుపాను ప్రభావం ఎన్నికల నిర్వహణపై పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, పోలింగ్ సిబ్బంది, ఎన్నికల సామగ్రి రవాణాకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 


సమీక్షలో ఆర్డీవోలు దిలీప్ చక్రవర్తి, సంగీత్ మాధుర్, జెడ్పీ సీఈవో నారాయణ మూర్తి, డిప్యూటీ సీఈవో సందీప్, రిటర్నింగ్ అధికారులు లక్ష్మీపతి, పూర్ణిమాదేవి, ఉషారాణి, రమేష్ నాయుడు, డీపీవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


.............................................

జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, విశాఖపట్నం.

Post a Comment

0 Comments