శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం * ​అర్ణబ్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో సింహాచల దేవస్థానం ముందస్తు అప్రమత్తత: * అధికారులతో ఈవో జల్లేపల్లి వెంకటరావు ఉన్నత స్థాయి సమీక్ష


సింహాచలం, అక్టోబర్ 25: బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్ణబ్' తుపాను ప్రభావంతో ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు గంటకు సుమారు 150 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.

 తుపాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి  జల్లేపల్లి వెంకటరావు ఆదివారం ఆలయ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో ఇంజనీరింగ్ అధికారులు, సహాయ కార్యనిర్వహణాధికారులు , పర్యవేక్షణ అధికారులు పాల్గొన్నారు.

​ఈ సందర్భంగా ఈవో జల్లేపల్లి వెంకటరావు మాట్లాడుతూ... తుపాను ప్రభావం చూపే నాలుగు రోజులు అధికారులు, సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. కొండపై, కొండ దిగువన ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా తక్షణమే స్పందించేందుకు వీలుగా ప్రత్యేక ఎమర్జెన్సీ బృందాలను రంగంలోకి దించుతున్నట్లు వెల్లడించారు.

​సమీక్షా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, ఆదేశాలు:

​నిరంతర పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ రూమ్: తుపాను పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు, సిబ్బందికి మార్గదర్శకాలు అందించేందుకు కొండపైన ప్రత్యేక 'కమాండ్ కంట్రోల్ రూమ్' ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కోల్డ్ స్టోరేజ్ వద్ద అనుకుని ఉన్న గోడ భద్రతను, అన్నప్రసాదం విభాగం – కోల్డ్ స్టోరేజ్ మధ్య మట్టి పూడ్చివేత ప్రదేశాలను ఇంజనీరింగ్ విభాగం నిశితంగా పరిశీలించాలి. కొండపైన ఉన్న వివిధ విభాగాల పైకప్పులు (రూఫ్‌లు), దక్షిణ వైపు మెట్ల మార్గం పరిసరాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. కొండపై ఎక్కడా వర్షపు నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువలను (డ్రైన్లు) యుద్ధప్రాతిపదికన పూడికతీత తీయించి శుభ్రం చేయించాలి.

కొండపైన, ఘాట్ రోడ్డు మార్గంలో విద్యుత్ తీగలు, రోడ్డుపైకి ప్రమాదకరంగా విస్తరించి ఉన్న చెట్ల కొమ్మలను ముందస్తుగానే కత్తిరించాలి. ఈదురు గాలులకు చెట్లు కూలిపోతే క్షణాల్లో వాటిని తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా క్లియర్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని పరికరాలతో సిద్ధంగా ఉంచాలి.

తుపాను దృష్ట్యా,స్వామివారి నివేదనకు,మరియు నిత్యాన్నప్రసాద విభాగానికి అవసరమైన నిత్యావసర సరుకులు, పప్పుదినుసులు, వంట చెరకు (ఫైర్ వుడ్), గ్యాస్ సిలిండర్లను కనీసం 10 రోజులకు సరిపడా నిల్వలు ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని సంబంధిత పర్యవేక్షకులను ఆదేశించారు.

భారీ గాలుల వల్ల విద్యుత్ లైన్లకు అంతరాయం కలిగే ప్రమాదం ఉన్నందున పవర్ లైన్లు, లీకేజీలను తనిఖీ చేయాలి. విద్యుత్ సరఫరా నిలిచినా అంతరాయం లేకుండా జనరేటర్లు నడిపేందుకు సరిపడా డీజిల్ (ఫ్యూయల్) నిల్వలను సిద్ధం చేసుకోవాలి. భక్తులకు తాగునీటి ఎద్దడి రాకుండా రిజర్వాయర్లలో నీటిని పూర్తిస్థాయిలో నిల్వ ఉంచాలి.

​తుపాను తీవ్రత ఉన్న సమయంలో భక్తుల ప్రాణరక్షణ దృష్ట్యా కొండపైకి వచ్చే మెట్ల మార్గాన్ని పూర్తిగా బంద్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెట్ల మార్గంలో కానీ, PAC బిల్డింగ్ మరియు కల్యాణ మండపం గ్రౌండ్ పరిసరాల్లో ఎవరూ ఉండకుండా ఖాళీ చేయించి పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు.

​ కొండ దిగువన ఉన్న శ్రీ కృష్ణాపురం గోశాలలో గోవులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాలి. తుపాను రోజులకు సరిపడా పచ్చిమేత, ఎండుగడ్డి, దాణా, సురక్షిత తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు.

​ అత్యవసర సమయాల్లో సేవలందించేందుకు సిబ్బందికి షిఫ్టుల వారీగా ప్రత్యేక డ్యూటీలు కేటాయించాలని, అవసరమైన రవాణా వాహనాలను సిద్ధంగా ఉంచాలని ఎస్టాబ్లిష్‌మెంట్, రవాణా  అధికారులకు స్పష్టం చేశారు.

​వాతావరణం అనుకూలించే వరకు భక్తులు దేవస్థాన నిబంధనలకు సహకరించి, అప్రమత్తంగా ఉండాలని ఈవో జల్లేపల్లి వెంకటరావు విజ్ఞప్తి చేశారు.

Post a Comment

0 Comments