విజయనగరం రైల్వే స్టేషన్‌లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0 విజయవంతం 150 మంది పెన్షనర్ల హాజరు – 65 మందికి అక్కడికక్కడే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ల సమర్పణకు సహకారం

 


విజయనగరం:నవంబర్ 6, 2026:రైల్వే పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు తమ వార్షిక డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను సులభంగా సమర్పించేందుకు దక్షిణ కోస్తా రైల్వే, విశాఖపట్నం డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేశవ్యాప్త డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 5.0లో భాగంగా ఈరోజు విజయనగరం రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక అవగాహన మరియు సహాయ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.

విశాఖపట్నం డివిజన్ అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ (ఇన్‌ఫ్రా) శ్రీ ఈ. సంతారం గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ శిబిరానికి సుమారు 150 మంది పెన్షనర్లు హాజరయ్యారు. వీరిలో దాదాపు 65 మంది పెన్షనర్లకు ఆధార్ ఆధారిత ఫేస్ ఆథెంటికేషన్ సాంకేతికత ద్వారా అక్కడికక్కడే డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను విజయవంతంగా సమర్పించేందుకు అధికారులు సహకరించారు. మిగిలిన పెన్షనర్లకు కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ విధానం, ఫేస్ ఆథెంటికేషన్ ప్రక్రియపై అవగాహన కల్పించి అవసరమైన సూచనలు అందించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పెన్షనర్ల ఆరోగ్య పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్, విజయనగరం డాక్టర్ డి. సౌజన్య ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ పర్సనల్ ఆఫీసర్ శ్రీ జె. రమేష్, విశాఖపట్నం డివిజన్‌తో పాటు బ్యాంకులు, అకౌంట్స్ మరియు పర్సనల్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొని పెన్షనర్లకు అవసరమైన సహాయ సహకారాలు అందించారు.

అన్ని విభాగాల సమన్వయం, అధికారుల చొరవతో ఈ శిబిరం విజయవంతంగా ముగిసింది. రైల్వే పెన్షనర్లకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సులభతరమైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు విశాఖపట్నం డివిజన్ నిరంతరం కృషి చేస్తోంది.

Post a Comment

0 Comments